ఒంటిమిట్ట లో వైభవంగా జరిగిన శ్రీ సీతారాము ల కళ్యాణము

ఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వ‌హించారు. శ్రీ కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ శంకర్ బాలాజీ గారు గుడి Dy E o శ్రీ లోకనాధం మరియ ప్రధానార్చకులు శ్రీ రాజేష్ భట్టార్ గారికి అందచేశారు

ప్రధానార్చకులు శ్రీ రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, పుణ్యాహ వచనం, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. వంశస్వరూపాన్ని స్తుతించారు. ఆ తరువాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. అనంతరం స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది. కరోనా వ్యాధి కారణంగా భక్తులు తమ ఇళ్ల నుండే స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *